రిపోర్టర్ :దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,ఆగస్టు 14 (నమస్తే న్యూస్)
విప్లవ యోధుడు ఆదర్శ కమ్యూనిస్టు రాయల చంద్రశేఖర్ పుస్తకావిష్కరణ సభ ఆగస్టు 16న ఉదయం 10 గంటలు ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు చంద్రశేఖర్ జీవిత సహచరి రాయల విమల ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ…..విప్లవం అంటే విందు భోజనం కాదు. విప్లవ ప్రేమ అంటే విహారాలు, విరహాలు, సరదాలు కాదు. ముళ్లూ, రాళ్లూ, అవాంతరాలూ ఉంటాయని తెలిసినా, ప్రాణాన్ని కాపాడుకోవడానికి కాదు—ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడి, నూనూగు మీసాల నవయవ్వనంలోనే అడవుల్లోకి దూకిన యువకుడు రాయల చంద్రశేఖర్.అమ్మ అమాయకంగా పెట్టిన ‘చంద్రశేఖర్’ అనే పేరును, ఆజాద్ చంద్రశేఖర్ స్ఫూర్తితో తన జీవితానికే అర్థంగా మార్చుకున్న విప్లవ యోధుడు ఆయన. రాయల గోపాలకృష్ణయ్య–రాంబాయమ్మల ముద్దుల కొడుకు. అప్పయ్య, సుభాష్ చంద్రబోస్, నాగేశ్వరరావుల సోదరుడు. పోరాటాన్ని వారసత్వంగా స్వీకరించి, యాభై ఏళ్ల పాటు విప్లవోద్యమంలో అవిశ్రాంతంగా నడిచిన మనిషి.ప్రేమించి పెళ్లాడిన జీవిత సహచరి విమలతో పాటు, కొడుకు పావెల్, కోడలు కీర్తి, మనవలు అపూర్వ కృష్ణ, ఆజాద్ కృష్ణలను కూడా తన విశ్వాసాల బాటలో నడిపించిన ఆదర్శనీయుడు. తన కుటుంబాన్నే సమాజ మార్పు ప్రయాణంలో భాగస్వాములను చేసిన విప్లవ ప్రేమికుడు.ఇంత సుదీర్ఘ పోరాటం తర్వాత, అలసి సొలసి ఒక “భగ్న విప్లవ ప్రేమికుడిగా” ఆయన నిష్క్రమణ ఒక వ్యక్తి విషాదం మాత్రమే కాదు—విప్లవోద్యమాలకు ఒక హెచ్చరిక.ఆయన మరణం ఒక మానని గాయం.ఆయన జీవితం ఒక అనుభవాల భాండాగారం.ఆయన నిష్క్రమణ ఒక ప్రశ్న.మనిషి కోసం సమాజాన్ని మార్చాలనుకునే మనం—
మనిషిని కోల్పోకుండా ఉండేందుకు మనలో ఏమి మార్చుకోవాలి?చంద్రశేఖర్ జీవితాన్ని స్మరించడం మాత్రమే ఆయనకు నివాళి కాదు. ఆయన అనుభవాల నుంచి నేర్చుకుని, మానవీయ విలువలతో సమాజ మార్పు కోసం పోరాడటమే ఆయనకు నిజమైన నివాళి.ఈ నేపథ్యంలో విప్లవ యోధుడు రాయల చంద్రశేఖర్ స్మారకంగా పుస్తకావిష్కరణ సభను ఆయన జీవిత సహచరి రాయల విమల, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆధ్వర్యంలో 2026 ఆగస్టు 16వ తేదీన ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నారు.ఈ సభకు ప్రముఖ పత్రికా సంపాదకులు సతీష్ చందర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా పలు విప్లవ, వామపక్ష పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని రాయల చంద్రశేఖర్ జీవితం, ఆయన సుదీర్ఘ విప్లవ ప్రస్థానం, అనుభవాలు, ఉద్యమ జీవితంలోని మానవీయ కోణాలపై ప్రసంగిస్తారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, అభ్యుదయవాదులు, మిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ పుస్తకావిష్కరణ సభను విజయవంతం చేయాలని రాయల చంద్రశేఖర్ జీవిత సహరి రాయల విమల కోరారు.
.

