డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 14(నమస్తే న్యూస్)
మరిపెడ మండల కేంద్రంలో గురువారం సర్వ సభ్య సమావేశం జరిగింది. సమావేశానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమావేశంలో మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్యుత్, ఇతర మౌలిక వసతుల కల్పనపై ప్రజా ప్రతినిధులతో క్షుణ్ణంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మండల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి. ప్రజల నుంచి వచ్చే సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు.సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలి అని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.అనంతరం మండలంలోని పలు అభివృద్ధి పనుల పురోగతి, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై అధికారులతో చర్చించి, పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. మరిపెడ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమష్టిగా కృషి చేయాలి అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


