నర్సింహులపేట, ఆగస్టు 14 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జగ్గూతండ పరిధిలోని చింతల్తండాలో అక్రమ నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్ఐ బానోత్ వెంకన్న ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి నిర్వహించిన దాడుల్లో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన పదార్థాలను గుర్తించారు.ఈ సందర్భంగా 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, నాటుసారా తయారీకి వినియోగిస్తున్న సుమారు 700 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అక్రమ నాటుసారా తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు.నాటుసారా తయారీ, విక్రయాలు వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. గ్రామాల్లో అక్రమ నాటుసారా కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.



