వర్షాభావాన్ని అధిగమించేందుకు పంటల వైవిధ్యం.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 13(నమస్తే న్యూస్)
వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు పంటల వైవిధ్యాన్ని పాటిస్తూ తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయ్‌చంద్ర సూచించారు.కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గురువారం మరిపెడ మండల కేంద్రంలోని మరిపెడ క్లస్టర్లో‘మిషన్ వైవిధ్యం’కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా విజయ్‌చంద్ర మాట్లాడుతూ..ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు ప్రణాళికతో పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులుగా పెసర,కంది,మినుములు వంటి ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా నీటి కొరతను అధిగమించవచ్చన్నారు.అదే సమయంలో పంట పెట్టుబడులను కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.రైతులు ఆయిల్‌పామ్ సాగుపై కూడా దృష్టి సారించాలని ఆయన సూచించారు.ఆయిల్‌పామ్ సాగు ద్వారా నీటి వినియోగాన్ని ఆదా చేయడంతో పాటు దీర్ఘకాలంలో అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుందని వివరించారు.నీటి వనరులు,భూమి స్వభావం,మార్కెట్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు.కూరగాయల సాగుతో నిరంతర ఆదాయం పొందే అవకాశం ఉంటుందని విజయ్‌చంద్ర తెలిపారు. వివిధ రకాల కూరగాయలను దశలవారీగా సాగు చేయడం ద్వారా తరచుగా దిగుబడులు పొందుతూ రైతులు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో పంట నష్టాలను తగ్గించుకోవడానికి పంటల వైవిధ్యమే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మరిపెడ డివిజన్ టెక్నికల్ ఏవో శ్రీదేవి,హార్టికల్చర్ హెచ్‌వో శాంతిప్రియ,ఏఈవోలు ఎన్.శ్రీకాంత్, పి.అన్వేష్,బి.అశోక్,డి.చరణ్,జె.స్రవంతి,సరితతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

