తక్కువ వర్షపాతంతో రైతాంగానికి నష్టం జరిగే ప్రమాదం – ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి
యూరియా యాప్ ను తక్షణమే ఎత్తివేసి రైతులకు సరిపడా ఎరువులు అందించాలి
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 13 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండలంలో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండటంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతోందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ డిమాండ్ చేశారు.
ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి గోదావరి జలాలను పాలేరు రిజర్వాయర్లు నింపి తర్వాత మండలంలోని అన్ని చెరువులకు మళ్లించి నింపాలని కోరారు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో సాగునీటిపై ఆధారపడిన రైతులు పంటల పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోతే పంటలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని, రైతులకు సాగునీరు అందించడంతో పాటు అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. చెరువులు, కుంటలు నింపడం ద్వారా భూగర్భ జలాలను పెంచి రైతులకు సాగునీటి భరోసా కల్పించాలని అన్నారు.అలాగే రైతులకు యూరియా అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో యూరియా యాప్ విధానాన్ని తక్షణమే ఎత్తివేసి, రైతులకు అవసరమైనంత యూరియాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలలో నిలబడే పరిస్థితిని నివారించాలని అన్నారు.రైతాంగ సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టి, పంటలను కాపాడేందుకు అవసరమైన సాగునీరు, ఎరువులు అందించాలని గొర్రెపాటి రమేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షులు గొర్రెపాటి వీరస్వామి ప్రగతిశీల యువజన సంగం జిల్లా నాయకులు షేక్ షబ్బీర్,వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

