డోర్నకల్ కార్యకర్తల సమావేశానికి వెళుతుండగా ఘటన.
మరిపెడ, ఆగస్టు 13 (నమస్తే న్యూస్): డోర్నకల్ కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యా నాయక్ ప్రయాణిస్తున్న కారుకు గురువారం తృటిలో ప్రమాదం తప్పింది. మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారులోని రైస్‌మిల్లుకు వెళ్లే రహదారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం.. ముందుగా వెళ్తున్న ఓ ద్విచక్రవాహనం అకస్మాత్తుగా యూటర్న్ తీసుకోవడంతో, ఎదురుగా వస్తున్న కూలీలను తప్పించేందుకు రెడ్యా నాయక్ కారు డ్రైవర్ వాహనాన్ని నెమ్మదించారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు మాజీ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే కారు వెనుక భాగం దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తూ రెడ్యా నాయక్‌తో పాటు కారులో ఉన్న ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.ప్రమాద ఘటనపై మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ స్పందిస్తూ.. కార్యకర్తలు, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న పార్టీ శ్రేణులు, అభిమానులు ప్రశాంతంగా ఉండాలని సూచించారు.“అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మీ ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలే నాకు కొండంత బలం. మీ అందరి అభిమానానికి, ఆప్యాయతకు హృదయపూర్వక ధన్యవాదాలని రెడ్యా నాయక్ తెలిపారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

