డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 12(నమస్తే న్యూస్).
మహబూబాబాద్ జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాల రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ శబరిష్ పి.ఐపీఎస్ ఆదేశాల మేరకు మరిపెడ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం మరిపెడ బస్టాండ్, కార్గిల్ సెంటర్ పరిసరాల్లో నార్కోటిక్ డాగ్‌తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.గంజాయి, డ్రగ్స్ తదితర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు అనుమానిత ప్రదేశాలు, పాన్ షాపులు, అనుమానిత ఇళ్లలో నార్కోటిక్ డాగ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. బస్టాండ్ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఉంచారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలను కలిగి ఉన్నా, విక్రయించినా, రవాణా చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అదేవిధంగా గంజాయి, డ్రగ్స్ లేదా ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు, తగిన పారితోషికం కూడా అందజేస్తామని పోలీసులు తెలిపారు.మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా అనుమానిత ప్రాంతాలపై నిఘా కొనసాగుతుందని, అవసరమైన చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులకు సహకరించి మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.ఈ తనిఖీల్లో మరిపెడ ఎస్ఐ గండ్రాతి సతీష్, ఎస్ఐ మైబుబి, పీసీలు రమేష్, శ్రీను తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




