తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా గంధంపల్లి పాఠశాలలో బోనాల వేడుకలు
రిపోర్టర్: పిల్లల నరసింహారావు
బయ్యారం, ఆగస్టు 5 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ జానపద సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా విద్యార్థులు బోనాలు ఎత్తుకుని, పోతురాజు, అమ్మవారి భక్తుల వేషధారణలో ఆకట్టుకున్నారు. తెలంగాణ జానపద గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ గ్రామస్థులను అలరించారు. డప్పు వాయిద్యాల నడుమ బోనాల ఊరేగింపు నిర్వహించడం వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.అనంతరం గ్రామంలోని బొడ్రాయి, ముత్యాలమ్మ దేవాలయాల్లో విద్యార్థులు జలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంధంపల్లి గ్రామ వీధుల్లో పోతురాజు వేషధారణలో విద్యార్థులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, బోనాలు తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని తెలిపారు. చిన్నారులకు తెలంగాణ ఆచారాలు, సంప్రదాయాలు, జానపద కళలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


