- కేశవపురం, బచ్చోడు తండా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసిన ఎంపీఓ షేక్ మీరా
- ప్రతి ఇంటిలో ఇంకుడు గుంటలు, వ్యవసాయ క్షేత్రాల్లో పంట కుంటలు ఏర్పాటు చేసుకోవాలి
- భూగర్భ జలాల పెంపుతో పాటు దోమల వ్యాప్తి నివారణకు దోహదం
రిపోర్టర్: దామల్ల భాస్కర్ తిరుమలాయపాలెం,ఆగస్టు 2 (నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండలం లోని కేశవపురం, బచ్చోడు తండా గ్రామాల్లో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను ఎంపీఓ షేక్ మీరా ఆదివారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. గ్రామాల్లో వీధులు, కాలువలు, చెత్త తొలగింపు, దోమల నివారణ చర్యలను పరిశీలించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి ఇంటి వద్ద తప్పనిసరిగా ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇంటి నుంచి బయటకు వచ్చే వాడుక నీటిని రోడ్లపైకి లేదా వీధుల్లోకి వదలకుండా ఇంకుడు గుంటల్లోకి మళ్లించడం వల్ల పరిశుభ్రత మెరుగుపడుతుందని తెలిపారు.ఇంకుడు గుంటల వల్ల భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు వీధుల్లో నీరు నిల్వ ఉండకుండా ఉండటం వల్ల దోమల వ్యాప్తి తగ్గి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు. అలాగే రోడ్లు బురదగా మారకుండా ఉండటంతో గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొంటుందని చెప్పారు.అదేవిధంగా, రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో పంట కుంటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలు పెరగడమే కాకుండా, సాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు.పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాల పరిశుభ్రతకు ప్రతి కుటుంబం సహకరించాలని, ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన గ్రామాలను నిర్మించగలమని ఎంపీఓ షేక్ మీరా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బచ్చోడు తండా సర్పంచ్ కుమారి బాలు, పంచాయతీ కార్యదర్శి ఉష, కేశవపురం సర్పంచ్ ఈదుల మహేష్, పంచాయతీ కార్యదర్శి శ్రావణి, హెచ్‌వీ మాధవి, హెల్త్ అసిస్టెంట్ సుధాకర్, ఆశా వర్కర్లు కవిత, సుజాత, వీవోఏ ధరావత్ జయ, అంగన్‌వాడీ టీచర్ సత్తెమ్మ కన్నెబోయిన ఉప్పలమ్మ తదితరులు పాల్గొన్నారు.


