జిల్లా కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశాలు
ప్రమాద ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి: జిల్లా ఎస్పీ శబరిష్
మహబూబాబాద్, జూలై 30 (నమస్తే న్యూస్): వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న రెండు నుంచి మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్ ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక విపత్తుల నివారణ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు.
జిల్లా కేంద్రంలో 7995074803 నంబర్‌తో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాగులు, చెరువులు, కుంటల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఇరిగేషన్ అధికారులు రోజువారీ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
భారీ వర్షాల వల్ల ప్రజలు, పశుసంపద, పంటలు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరగకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలని, మిషన్ భగీరథ ద్వారా సురక్షిత తాగునీటి సరఫరా నిరంతరంగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ మాట్లాడుతూ.. మండల స్థాయిలో విపత్తుల నివారణ కమిటీలతో సమావేశాలు నిర్వహించి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. చెరువులు, కాలువలు, వాగులు, పర్యాటక ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైతే బోట్లు, మత్స్యకారులను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు, డీఆర్ఓ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

