Type Here to Get Search Results !

ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాసు.

ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి:
సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాసు.


నర్సింహులపేట మండల కేంద్రంలో సీపీఎం మండల కమిటీ సమావేశం.



నర్సింహులపేట, జూన్ 12 (నమస్తే న్యూస్)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాసు పిలుపునిచ్చారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.మండల కేంద్రంలో ఉమ్మడి నర్సింహులపేట సీపీఎం మండల కమిటీ సమావేశం మందుల యాకూబ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సాదుల శ్రీనివాసు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై భారం అధికమైందని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని అన్నారు. ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ప్రాధాన్యత ఇస్తూ సామాన్య ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తోందని ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతుబంధు నిధులు, ధాన్యం కొనుగోలు బకాయిలు ఇంకా చెల్లించలేదని, రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ వంటి ఎరువుల సరఫరా సక్రమంగా జరగడం లేదని అన్నారు. యాప్‌ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రజలను ఆశలతో ఉంచుతోందని, పెంచుతామని చెప్పిన పెన్షన్లు పెంచలేదని, రైతు రుణమాఫీని పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. రైతు బీమా, ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.గ్రామాల్లో పారిశుధ్య సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, వీధి దీపాలు, మంచినీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్న ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆకుల రాజు, ఉమ్మడి నర్సింహులపేట మండల కన్వీనర్ గునిగంటి మోహన్, మందుల యాకూబ్, బానోతు సర్వన్, కూరంది సురేష్, కందుకూరు సుధాకర్, జక్కుల లింగయ్య, దయ్యాల మల్లయ్య, లక్ష్మయ్య, వీరభద్రం, ఉస్మాన్, యాదగిరి, హంసారెడ్డి, యాదగిరి అన్న తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.