Type Here to Get Search Results !

అభివృద్ధే లక్ష్యంగా కొనసాగుతున్న ప్రగతి ప్రణాళిక సభలు

మరిపెడ మండలంలోని పలు  గ్రామాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభలు.







డోర్నకల్/మరిపెడ (జూన్ 08)నమస్తే న్యూస్:

మరిపెడ మండలంలోని పలు గ్రామాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలు సోమవారం ఘనంగా నిర్వహించారు.సర్పంచులు,ఊళ్లేపెల్లి నవీలే కలమ్మ,లూనావత్ తండ లూనావత్ సోనియా,భూక్యా తండ బోడ మంగ్ని,దంట్లకుంట తండ గుగులోత్ అరుణ,వీరారం గుండె రాములు సర్పంచులు,మండల స్థాయి అధికారులు,గ్రామ స్థాయి అధికారులు ఈ సభల్లో పాల్గొని ప్రభుత్వ ప్రగతి పాలన,అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు.  


వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి:


సభల్లో వ్యవసాయ అధికారి వీరాసింగ్ మాట్లాడుతూ పంట మార్పిడి ప్రాధాన్యతను విస్తృతంగా వివరించారు.వరి మాత్రమే కాకుండా మొక్కజొన్న,కంది,మినుము,పెసర,ఆముదం,కూరగాయలు వంటి మెట్ట పంటలు,వాణిజ్య పంటల వైపు రైతులు మళ్లాలని సూచించారు.మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలు ఎంచుకుంటే నష్టభయం తగ్గి ఆదాయం పెరుగుతుందని తెలిపారు.నేలలో సూక్ష్మపోషకాల లోపాన్ని నివారించేందుకు,భూసారాన్ని కాపాడేందుకు పప్పు ధాన్యాల సాగు మేలని వివరించారు.వరుసగా ఒకే పంట వేయడం వల్ల చీడపీడల బెడద పెరుగుతుందని,పంట మార్పిడి వల్ల వాటి ఉధృతి తగ్గుతుందని రైతులకు అవగాహన కల్పించారు.డ్రిప్,స్ప్రింక్లర్ల వంటి సూక్ష్మ సేద్య పద్ధతులు,ఆదర్శ పొలం బడులు,ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా ప్రోత్సహించారు.రైతు వేదికల ద్వారా సాంకేతిక సలహాలు,వాతావరణ సూచనలు అందుతాయని గుర్తుచేశారు.రైతు భరోసా,పంటల బీమా,యాంత్రీకరణ పథకాల లబ్ధిని వివరించి దరఖాస్తు విధానాన్ని తెలియజేశారు.అలాగే వ్యవసాయంపై సలహాలు సూచనలకు మీ మీ గ్రామాల్లో వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారు,వారు మీకు వ్యవసాయ అభివృద్ధి సలహాలు ఇస్తారని తెలియచేశారు.


చెట్ల ప్రాముఖ్యత,పరిసరాల పరిశుభ్రత:  


ఈ సందర్భంగా అధికారులు ఏ పి ఓ సోమ్లా నాయక్ మాట్లాడుతూ చెట్ల ప్రాముఖ్యతను వివరించారు.చెట్లు వర్షాలు కురిసేందుకు,భూగర్భ జలాలు పెరిగేందుకు,వాతావరణ కాలుష్యం తగ్గేందుకు దోహదపడతాయని తెలిపారు.ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో,ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు.వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. గ్రామాల పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం వల్ల దోమలు,ఈగలు పెరిగి అంటురోగాలు ప్రబలుతాయని హెచ్చరించారు.ప్రతి ఇంట్లో తడి చెత్త,పొడి చెత్త వేరుచేసి పంచాయతీ సిబ్బందికి అందించాలని సూచించారు.మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని,బహిరంగ మలవిసర్జన పూర్తిగా మానుకోవాలని కోరారు.


మహిళల ఆరోగ్యం, గృహ పరిశుభ్రత:


ఏఎన్ఎంలు,ఆశా వర్కర్లు మాట్లాడుతూ ఇంట్లో మహిళలు పరిశుభ్రత పాటించకపోతే కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.వంటగది,పాత్రలు,తాగునీటి పాత్రలు శుభ్రంగా లేకపోతే డయేరియా,కలరా,టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయని తెలిపారు.పిల్లలకు చేతులు కడిగే అలవాటు చేయాలని,కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంటే దోమలు పెరిగి మలేరియా,డెంగ్యూ వంటి ప్రమాదకర జ్వరాలు వస్తాయని హెచ్చరించారు.పోషకాహార లోపం లేకుండా ఆకుకూరలు,పండ్లు తీసుకోవాలని,గర్భిణులు,బాలింతలు తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రాల సేవలు వినియోగించుకోవాలని కోరారు.వ్యక్తిగత పరిశుభ్రతతోనే కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.


మహిళా సంక్షేమం.


మహిళల భద్రత,స్త్రీల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు.మహిళా సంఘాల బలోపేతం,స్వయం ఉపాధి పథకాలు,భద్రతా చట్టాలపై అవగాహన కల్పించారు.మహిళా సంఘాల పనితీరు గురించి మహిళలకు తెలియజేశారు.గ్రామాల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులు,పెండింగ్ సమస్యలను సర్పంచులు ప్రజల దృష్టికి తీసుకెళ్లారు.ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ అధికారులు ఏఓ లు,ఏఈఓలు,ఏ పి ఓ లు,అంగన్‌వాడీలు,ఏఎన్ఎంలు,ఆశా వర్కర్లు,మహిళా సంఘాల నాయకులు,గ్రామ పెద్దలు,రైతులు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.