- శిథిలావస్థలో స్త్రీ-శక్తి భవనం..ప్రజాధనం వృథాయేనా..?
- మహిళా సాధికారతకు ప్రతీకగా నిలవాల్సిన భవనం నిరుపయోగం..అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు.
- కొన్ని ఏళ్లుగా మూతపడిన స్త్రీ శక్తి భవనం..మహిళా సంఘాల కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులు.
- లక్షల రూపాయలతో నిర్మాణం.. వినియోగం శూన్యం.
నర్సింహులపేట, జూలై 10 (నమస్తే న్యూస్)
మహిళల ఆర్థిక సాధికారతకు, స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలకు కేంద్రబిందువుగా నిలవాల్సిన స్త్రీ శక్తి భవనం అధికారుల నిర్లక్ష్యానికి బలై శిథిలావస్థకు చేరుకుంది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో నిర్మించిన ఈ భవనం పూర్తయి చాలా కాలం గడిచినా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం అధికార యంత్రాంగం పనితీరుపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది.దాదాపు పదిహేనేళ్ల క్రితం మంజూరైన ఈ భవనం నిర్మాణం పూర్తయినప్పటికీ వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ప్రస్తుతం పాడుబడి శిథిలావస్థలో కనిపిస్తోంది. లక్షల రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన భవనం నిర్వహణ లేక మూలనపడిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని మహిళా సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్త్రీ శక్తి భవనం అందుబాటులో లేకపోవడంతో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, స్వయం సహాయక సంఘాల సమీక్షలు, మహిళల ఉపాధి సంబంధిత కార్యక్రమాలు సరైన వేదిక లేక ఇబ్బందికర పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. మహిళా సాధికారత కృషిచేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, మరోవైపు మహిళల కోసం నిర్మించిన భవనాన్ని వినియోగంలోకి తీసుకొని రావడానికి చర్యలు చేపట్టాలని,ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి స్త్రీ శక్తి భవనాన్ని వెంటనే ప్రారంభించి మహిళా సంఘాల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని స్వయం సహాయక సంఘాల సభ్యులు, మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే లక్షల రూపాయలతో నిర్మించిన ఈ భవనం కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉందని మహిళలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

