కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని విపక్ష పార్టీల పిలుపు
రిపోర్టర్: దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, ఆగస్టు 10 (నమస్తే న్యూస్):
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో తిరుమలాయపాలెం మండల కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్, సీపీఎం, టీఆర్ఎస్, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ, సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా మాస్‌లైన్ పార్టీల నాయకులు పిలుపునిచ్చారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తోందని నాయకులు ఆరోపించారు. ఎందరో పోరాటయోధుల ప్రాణత్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్ర్యాన్ని విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతూ కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.నాలుగు లేబర్ కోడ్లు, వాటి నిబంధనలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని, వీఎంజీ చట్టాన్ని రద్దు చేసి సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని కోరారు. అలాగే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, రోజువారీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జైల్ భరో కార్యక్రమంలో భాగంగా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో జరిగే కార్యక్రమానికి కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొప్పుల అశోక్, సీపీఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్, సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా మాస్‌లైన్ మండల కార్యదర్శి సోమనబోయిన వెంకటేశ్వర్లు, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా నాయకులు తిమ్మిరి హనుమంతరావు, టీఆర్ఎస్ మండల నాయకుడు కొవ్వూరి సత్తిరెడ్డి, గంట కృష్ణ, మూటపోతుల శ్రీను, బండ్ల సురేష్, సీపీఎం నాయకులు తుళ్లూరు నాగేశ్వరరావు, కొమ్ము నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకుడు బొబ్బిలి భరత్ చంద్ర, గొల్ల లింగయ్య, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ మండల నాయకులు గొర్రపాటి వీరస్వామి, లింగంపల్లి సురేష్, మధు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

