నరసింహులపేటలో కరపత్రం ఆవిష్కరణ.
నరసింహులపేట,ఆగస్టు06(నమస్తే న్యూస్): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతు, కూలీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఆకుల రాజు పిలుపునిచ్చారు. గురువారం నరసింహులపేట మండల కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి ప్రజాసంఘాల జనరల్ బాడీ సమావేశంలో జైల్ భరో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆకుల రాజుతో పాటు జీఎంపీఎస్, కేవీపీఎస్ జిల్లా నాయకులు పయ్యావుల మల్లయ్య, మందుల యాకూబ్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే విధంగా తీసుకొచ్చిన కొత్త విధానాలను తీవ్రంగా విమర్శించారు. గ్రామీణ పేదల పని హక్కును దెబ్బతీసే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం 200 రోజుల ఉపాధికి చట్టబద్ధ హామీ కల్పించాలని, జీవనానికి సరిపడే వేతనాన్ని సకాలంలో చెల్లించాలని, పని కోరిన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించే విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వత్రికంగా అమలు చేసి బియ్యం, గోధుమలు, పప్పులు, వంటనూనె, చక్కెర, ఉప్పు తదితర నిత్యావసర వస్తువులను ప్రతి కుటుంబానికి అందించాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో పయ్యావుల మల్లయ్య, మందుల యాకూబ్, యాదగిరి, రమేష్, బాబు, మధు తదితర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

