- ఉపాధి హామీలో అధికారి నిరంకుశ పాలన..!
- చెప్పిందే శాసనం.. వినకుంటే మస్తర్లలో పేరు గల్లంతు..?
- కూలీలపై కక్షసాధింపు.. ఫీల్డ్ అసిస్టెంట్లపై బెదిరింపులు..?
- పేదల పథకాన్ని వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకున్న అధికారిపై ఆగ్రహం.
నర్సింహులపేట,జూలై4(నమస్తే న్యూస్): పేదల జీవనాధారంగా నిలవాల్సిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో ఓ అధికారి వైఖరి తీవ్ర విమర్శలకు గురవుతోంది. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతను మరచిపోయిన సదరు అధికారి, “నేను చెప్పిందే చట్టం.. నేను చెప్పినట్లే జరగాలి” అన్న ధోరణితో వ్యవహరిస్తున్నారని కూలీలు, సిబ్బంది మండిపడుతున్నారు.మండలంలో ఉపాధి హామి పనులు పారదర్శకంగా కాకుండా, అధికారి ఇష్టానుసారంగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే ఎక్కువ పని దినాలు కల్పిస్తూ, ప్రశ్నించిన వారిని మస్తర్ల నుంచి తొలగించడం, కూలి చెల్లింపుల్లో జాప్యం చేయించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.”అధికారి మాట వినకపోతే మరుసటి రోజు నుంచి పని ఉండదు… మస్తర్లలో పేరు కనిపించదు… కూలి డబ్బులు కూడా ఆలస్యం అవుతాయి” అంటూ పలువురు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకం ద్వారా జీవనం సాగిస్తున్న పేదల కడుపుపై ఇలా కక్షసాధింపు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.కేవలం కూలీలే కాకుండా, క్షేత్రస్థాయిలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా సదరు అధికారి తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నట్లు సమాచారం.నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలని బలవంతం చేయడం,అంగీకరించకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించడం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.మరోవైపు, కొందరు ఎలాంటి పని చేయకుండానే వేతనాలు పొందుతుండగా, నిజంగా ఎండనక, వాననక శ్రమించే కూలీలకు మాత్రం అన్యాయం జరుగుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని కొందరి స్వప్రయోజనాలకు వేదికగా మార్చి,అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు తీవ్రతరం అవుతున్నాయి.పేదల సంక్షేమం కోసం రూపొందించిన ఉపాధి హామీ పథకం ఆశయాలను నీరుగార్చేలా వ్యవహరిస్తున్న అధికారిపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.కూలీల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలు వెలికితీసి, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

