- పీఆర్సీ నివేదిక తెప్పించుకుని వెంటనే అమలు చేయాలి.
- ఇహెచ్ఎస్ నిబంధనలు రూపొందించి వెంటనే అమలు చేయాలి
- టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్.
రిపోర్టర్:దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,జూలై 6 (నమస్తే న్యూస్ )
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తెలంగాణ రెండవ పిఆర్సీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, 2023 జులై నుండి అమలు కావాల్సిన నూతన పీఆర్సీ 36 నెలల కాలం పూర్తి అయినందున ప్రభుత్వం వెంటనే నివేదికను తెప్పించుకుని సంఘాలతో చర్చించి అమలు చేయాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. హెల్త్ కార్డుల విధివిధానాలు రూపొందించి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మండలంలో సంఘ సభ్యత్వ క్యాంపైన్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల, రిటైరైన ఉద్యోగుల పెండింగ్ బిల్లులు అన్నీ క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ ఉపాధ్యాయుల డిఎ బకాయిలు విడుదల చేయాలని, బకాయి ఉన్న ఆరు వాయిదాల డిఎ లను ప్రకటించాలని, ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలను రూపొందించి పర్యవేక్షణ అధికారుల పదోన్నతులు చేపట్టాలని కోరారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని, 2003 డిఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలని, కెజిబివి, సమగ్ర శిక్షా ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలని,సమ్మె కాలపు వేతనం మంజూరు చేయాలని కోరారు. విద్యాహక్కు చట్టాన్ని సవరించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుండి మినహాయించాలని, బోధించే సబ్జెక్టులలో టెట్ పరీక్షలు నిర్వహించాలని, సర్వీస్ వెయిటేజ్ ఇవ్వాలని కోరారు. ఈ క్యాంపైన్ లో జిల్లా , మండల నాయకులు సుధాకర్, కేశ్యా, రవిబాబు, శంకర్ రావు, శ్రీనివాసరావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


