- ఆయువు తీసిన అర్ధాంగి.
- సింగారం హత్య కేసును ఛేదించిన జిల్లా పోలీసులు.
- రూ.4 లక్షల సుపారీతో హత్యకు కుట్ర…ఏడుగురు అరెస్ట్.
- వివాహేతర సంబంధం, ఆస్తి వివాదాలే హత్యకు ప్రేరేపకాలు.
- నిందితులను అరెస్టు చేసిన పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ డా.శబరీష్.
మహబూబాబాద్, జూలై 4 (నమస్తే న్యూస్ క్రైమ్):
మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ పిట్టల యాకయ్య (57) హత్య కేసు మిస్టరీని మహబూబాబాద్ జిల్లా పోలీసులు కేవలం నాలుగు రోజుల్లోనే ఛేదించారు.మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య కేసును చేదించారు.భార్య పిట్టల యశోద సూత్రధారిగా వ్యవహరించి మరో ఆరుగురు వ్యక్తులతో కలిసి హత్య చేసినట్లుగా జిల్లా ఎస్పీ డా. శబరీష్ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.పోలీసుల కథనం ప్రకారం.. యాకయ్యకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో పాటు, తన భర్త ఆస్తిని ఆమె పేరుపై రాస్తాడనే భయంతో యశోద తీవ్ర ఆందోళనకు గురైంది. ఈ నేపథ్యంలో కుటుంబంలో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతుండగా, భర్తను అడ్డుతొలగించాలని నిర్ణయించుకుని మరో ఆరుగురు వ్యక్తులతో కలిసి రూ.4 లక్షల సుపారీకి ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు.పథకం ప్రకారం జూన్ 30 అర్ధరాత్రి నుంచి జూలై 1 తెల్లవారుజామున ఇంటి వరండాలో నిద్రిస్తున్న యాకయ్యపై మారణాయుధాలతో తీవ్రంగా దాడిచేసి హత్య చేశారు. అనంతరం ఘటనను దోపిడీ కోణంలో చూపించే ప్రయత్నంగా ఆయన మెడలోని బంగారు గొలుసును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు.కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ కాల్ డేటా, టవర్ లొకేషన్లు, నిందితుల కదలికలు తదితర సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నాలుగు రోజుల్లోనే కేసును ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు పిట్టల యశోద (A-1)తో పాటు గంగుల కృష్ణ (A-2), మోహన్ రెడ్డి (A-3), తుమ్మిడి నర్సమ్మ (A-4), వెంకన్న (A-5), శివ (A-6), కృష్ణమూర్తి (A-7)లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఐరన్ రాడ్, 7 సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, కారు, బంగారు గొలుసు తదితర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ డా. శబరీష్ అభినందించారు.
