సెయింట్ లూయిస్‌లో విషాద ఘటన..ట్రక్ ఢీకొనడంతో దారం సుప్రజ దుర్మరణం.
డోర్నకల్/మరిపెడ,అక్టోబర్ 04 (నమస్తే న్యూస్):
అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన దారం సుప్రజ మృతి చెందారు.విదేశాల్లో స్థిరపడిన మరిపెడ వాసి ప్రమాదంలో మృతి చెందారన్న వార్త స్థానికంగా విషాదాన్ని నింపింది.సమాచారం ప్రకారం..సెయింట్ లూయిస్‌లో సుప్రజ రెస్టారెంట్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.ప్రతిరోజు మాదిరిగానే రాత్రి రెస్టారెంట్‌ను మూసివేసిన అనంతరం స్నేహితురాలితో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు.కొద్దిసేపటికే వారు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో దారం సుప్రజ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.ఆమెతో పాటు కారులో ప్రయాణిస్తున్న స్నేహితురాలికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.సుప్రజ మృతితో మరిపెడలోని ఆమె కుటుంబ సభ్యులు,బంధువులు,స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విదేశాల్లో కష్టపడి జీవనం సాగిస్తున్న ఆమె ఇలా మృతి చెందడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది.సుప్రజకు భర్త, కుమారుడు ఉన్నారు.సుప్రజ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఆమె మృతితో మరిపెడ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులను పలువురు బంధువులు,స్నేహితులు పరామర్శిస్తూ తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
