60 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటింగ్‌తో ఎన్నిక
గౌడ కుటుంబాల సంక్షేమం, బీమా సదుపాయం కోసం కృషి చేస్తా: రమేష్ గౌడ్
రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్ | సెంటర్: బయ్యారం
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తపేట, గంధంపల్లి, దుబ్బగూడెం గ్రామాల గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన మండవ చింత చెట్టు వద్ద ప్రతి రెండేళ్లకోసారి దసరాకు ముందు గౌడ సంఘం కమిటీని ఎన్నుకునే ఆనవాయితీ కొనసాగుతోంది.
ఇప్పటివరకు సుమారు 60 ఏళ్లుగా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ వస్తుండగా, ఈసారి తొలిసారిగా ఓటింగ్ ద్వారా ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గట్టు రమేష్ గౌడ్ అధ్యక్షుడిగా విజయం సాధించారు.
ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. ఓటింగ్ ద్వారా తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న గౌడ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. గౌడ కులస్తుల ఆరాధ్యదైవమైన కాటమయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గౌడ కుటుంబాలను చల్లగా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు.
గౌడ సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. తాడిచెట్టు ఎక్కి కల్లు తీసుకుంటూ జీవనం సాగించే గౌడ కులస్తులు ప్రమాదాలకు గురై గాయపడినా, మృతిచెందినా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. వారికి బీమా సదుపాయం కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ బుర్ర రమేష్ గౌడ్, సెక్రటరీ పిల్లల మల్లికార్జున్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు చిర్ర శీను గౌడ్, గునిగంటి శివాజీ గౌడ్, రంగు కుమారస్వామి గౌడ్, వేసిన సాంబయ్య గౌడ్, జలగం ఉపేంద్ర గౌడ్, కొండ బిక్షపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
