వెల్డింగ్ పని చేస్తూ ప్రమాదవశాత్తు యువకుడి మృతి
ముగ్గురు ఆడపిల్లలతో దిక్కుతోచని స్థితిలో కుటుంబం.. ఆపన్నహస్తం అందించిన కత్తి రమేష్
బయ్యారం, సెప్టెంబర్ 12 (నమస్తే న్యూస్):
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన కందిపాటి వెంకన్న కుమారుడు కందిపాటి యాకన్న ఇటీవల వెల్డింగ్ పని చేస్తూ ఇంటిపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. చిన్న వయసులోనే కుటుంబ పెద్దను కోల్పోవడంతో ముగ్గురు ఆడపిల్లలతో కూడిన ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది.
నిరుపేద కుటుంబానికి చేయూత
యాకన్న కుటుంబం దీనస్థితిని బరిగెల ఉపేందర్ ద్వారా తెలుసుకున్న బయ్యారం మేజర్ గ్రామపంచాయతీ 5వ వార్డు సభ్యుడు కత్తి రమేష్ స్పందించారు. తన తండ్రి కత్తి సత్యం జ్ఞాపకార్థం బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని వితరణగా అందించడంతో పాటు ఆర్థిక సహాయం చేశారు.
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన కత్తి రమేష్‌కు యాకన్న కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి ప్రస్తుత పరిస్థితుల్లో అందుతున్న చిన్నపాటి సహాయం కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి
యాకన్న మృతితో కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరు కోల్పోయిందని, ముగ్గురు ఆడపిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవతా దృక్పథంతో దయాహృదయులు ముందుకు వచ్చి తమకు తోచిన మేరకు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో బరిగెల ఉపేందర్, కందిపాటి నాగరాజు, మబ్బు ప్రశాంత్, పోతురాజు రాజశేఖర్, బరిగెల గణేష్, మట్టె సునీల్, మట్టి గణేష్, నందిపాటి పవన్, గుండెపాక సిద్ధార్థ, మట్టె విష్ణు, నందిపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

