తండాకు మంచినీటి సరఫరా పునరుద్ధరణ
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 10(నమస్తే న్యూస్).
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బావోజిగూడెం గ్రామ శివారులోని వాగోడు తండాలో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది.తండాలో జనాభా పెరగడంతో పాటు తాగునీటి అవసరాలు అధికం కావడంతో గ్రామ ప్రజలు చేసిన విన్నపం మేరకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అదనపు బోరును ఏర్పాటు చేశారు.గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా వాగోడు తండాలో నీటి ట్యాంకును నిర్మించి తాగునీటిని సరఫరా చేస్తున్నారు.అయితే ఇటీవల జనాభా పెరగడంతో నీటి వినియోగం కూడా పెరిగింది.దీంతో ప్రస్తుతం అందుతున్న నీరు తండా ప్రజల అవసరాలకు సరిపోకపోవడంతో అదనపు నీటి వసతి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సూచనలు,మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు సహకారం,గ్రామ సర్పంచ్ భూక్య శంకర్ చొరవతో అదనపు బోరు ఏర్పాటు పనులు పూర్తయ్యాయి.తండా ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ చర్యతో నీటి సమస్యకు కొంతమేర పరిష్కారం లభించినట్లయింది.వాగోడు తండాకు చెందిన మాజీ సర్పంచ్ ఆజ్మీర బేబీ రాణి రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు.తండా ప్రజలు,గ్రామ పెద్దల సూచనలు,ఏకాభిప్రాయంతో అదనపు నీటి వసతి ఏర్పాటు పనులను పూర్తి చేసినట్లు తెలిపారు.అదనపు బోరు ద్వారా తండాకు మంచినీటిని అందించే కార్యక్రమాన్ని గుడిపూడి నవీన్ రావు మోటార్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.దీంతో తండా ప్రజలకు అదనంగా తాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న గ్రామ పంచాయతీ ప్రతినిధులు,సహకరించిన నాయకులకు తండా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా పాల్గొన్న వారు సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు,గ్రామ పెద్దలు,తండా ప్రజలు,యువత తదితరులు పాల్గొన్నారు.


