బయ్యారం మండలంలో శ్రీకారం
ప్రతి బూత్‌లో సేవా సంకల్ప్ అభియాన్‌కు కార్యక్రమాలు చేపట్టాలి బీజేపీ మండల అధ్యక్షులు నాయిని శ్రీనివాస్
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోనీ మండల బీజేపీ కార్యాలయంలో ఈరోజు మండల అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ అధ్యక్షతన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం జిల్లా సెక్రటరీ మురళి హాజరై సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం ఉద్దేశాలు, నిర్వహించాల్సిన సేవా కార్యక్రమాల గురించి కార్యకర్తలకు వివరించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ప్రతి బూత్ స్థాయిలో ప్రతి బీజేపీ కార్యకర్త ఒక సేవా కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. సమాజంలోని పేదలు, బలహీన వర్గాలు, అవసరంలో ఉన్న ప్రజలకు అండగా నిలిచి సేవ చేయడమే ఈ అభియాన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
జిల్లా కార్యవర్గ సభ్యులు వన్నం రామారావు మాట్లాడుతూ…నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే అనేక సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. మోదీ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించాలని, ప్రతి కార్యకర్త తనకు సాధ్యమైన విధంగా ఒక సేవా కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు.
బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఊకే రామూర్తి మాట్లాడుతూ, ప్రతి కార్యకర్త సేవా సంకల్ప్ అభియాన్‌లో చురుకుగా పాల్గొనాలని అన్నారు. గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండి, అందరం ఐక్యంగా, కట్టుదిట్టంగా ముందుకు సాగుతూ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బయ్యారం మండల మహిళా ఉపఅధ్యక్షురాలు మంగమ్మ , జిల్లా కౌన్సిల్ మెంబర్ విశ్వేశ్వర్ రావు , సోషల్ మీడియా ఇన్చార్జ్ రామ్‌దాస్, మండల యువమోర్చా మహేష్ , ఎస్టీ మోర్చా ఎల్. శ్రీను, వార్డు సభ్యులు, జిల్లా నాయకులు అంగోత్ శ్రీను , బిజ్జ కనకయ్య, సీనియర్ నాయకులు రాంబాబు, వెంకటేశ్వర్లు, చంద్రయ్య, గాంధీ, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


