మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ పరిధిలోని గణేష్ ఉత్సవ కమిటీలకు తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ కీలక సూచనలు జారీ చేశారు…. గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధిత పోలీస్స్టేషన్ పరిధిలో ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. మండపాల ఏర్పాటు సందర్భంగా ప్రజలకు వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.డీజేలు సౌండ్ బాక్సుల వినియోగంలో నిబంధనలు పాటిస్తూ ఇతరులకు అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించాలని తెలిపారు. మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలకు తావులేకుండా వైరింగ్ విద్యుత్ కనెక్షన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నాణ్యమైన వైర్లు సురక్షితమైన విద్యుత్ పరికరాలను మాత్రమే వినియోగించాలని సూచించారు.భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ కృష్ణ కిషోర్ కోరారు.

