రామన్నపేట సెప్టెంబర్ 6(నమస్తే న్యూస్)
డప్పుల మోత,యువత నృత్యాలు.. మహిళల బోనాల ఊరేగింపుతో నిదానపల్లి పల్లె పండుగ శోభను సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల జాతర యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ముత్యాలమ్మ తల్లికి గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తొలుత గ్రామపంచాయతీ నుంచి సర్కారు బోనాన్ని కోట మైసమ్మ తల్లికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు బోనాలతో తరలిరాగా.. యువకులు ఆటపాటలు, నృత్యాలతో సందడి చేశారు. డప్పుల మోతల మధ్య సాగిన ఊరేగింపు ఆకట్టుకుంది. చిన్నారులు, యువత ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
అమ్మవారి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని.. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ముగింపు వేడుకలకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో నిదానపల్లి సందడిగా మారింది.


