పంటల వైవిధ్యీకరణతో రైతులకు ప్రయోజనం
జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. విజయచంద్ర
రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
బయ్యారం, సెప్టెంబర్ 6 (నమస్తే న్యూస్):
ఎరువుల విక్రయాల్లో డీలర్లు నిబంధనలు తప్పక పాటించాలని, రైతులకు పారదర్శకంగా ఎరువులు అందించాలని మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. విజయచంద్ర సూచించారు.ఫెర్టిలైజర్ ఇన్వెంటరీ వెరిఫికేషన్ కార్యక్రమంలో భాగంగా కొత్తపేట, బయ్యారం గ్రామాల్లోని ఎరువుల విక్రయ కేంద్రాలను జిల్లా వ్యవసాయ అధికారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, విక్రయాల వివరాలతో పాటు డీలర్లు తప్పనిసరిగా నిర్వహించాల్సిన రికార్డులను పరిశీలించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, ఎరువుల విక్రయాల్లో పారదర్శకత పాటించాలని డీలర్లకు సూచించారు.అనంతరం బయ్యారం గ్రామానికి చెందిన రైతు సుంకర రాజా సాగు చేస్తున్న పెసర పంటను పరిశీలించారు. విజయవంతంగా పెసర సాగు చేస్తున్న రైతును అభినందించిన ఆయన.. ఇతర రైతులు కూడా సంప్రదాయ పంటలతో పాటు పంటల వైవిధ్యీకరణను అవలంబించాలని సూచించారు.అదేవిధంగా సంతులాల్పోడు తండాలో చాగర్లమూడి భాస్కర్ సాగు చేస్తున్న పెసర పంట పొలాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు. సాగునీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పొడి పంటల సాగుపై దృష్టి సారించాలని తెలిపారు.రైతులు పంటల వైవిధ్యీకరణను చేపట్టడం ద్వారా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు కొనసాగించడంతో పాటు ఆదాయాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.


