పెరుగుతున్న ధరలను వెంటనే నియంత్రించాలి.
సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ డిమాండ్.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 31(నమస్తే న్యూస్).
నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతూ సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మరిపెడ మండల కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిధి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..బియ్యం,చక్కెర, ఉల్లిగడ్డ, బంగాళాదుంపలు, పప్పులు, ఉప్పులు, వంట నూనెలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో పేద,మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.ఆదాయాలు పెరగకపోయినా నిత్యావసరాల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయని, సమాన్యుని జీవితం గడవడం కష్టంగా మారిందని,రోజంత కష్టపడితే వచ్చే కూలి డబ్బులు నిత్యావసరాలకు పోగా మిగలేది ఏమి లేదని,ఖర్మకాలి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తట్టుకోలేని పరిస్థితిలో పేదవారి జీవితాలు ఉన్నాయని దుర్మార్గంగా ధరలు పెరగడం బాధాకరమన్నారు.రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి,వినియోగదారులకు అధిక ధరలకు విక్రయించే దళారీ వ్యవస్థను అరికట్టాలని, అక్రమ నిల్వలు, నల్లబజారుపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రజలకు అందుబాటు ధరల్లో నిత్యావసర వస్తువులు లభించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని, రైతు బజార్లు మరియు ప్రభుత్వ విక్రయ కేంద్రాలను విస్తరించాలని కోరారు. నిత్యావసర ధరలను వెంటనే నియంత్రించకపోతే సామాన్య ప్రజల పక్షాన సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

