అవసరమైతే జనగామ ట్రాన్స్‌కో సర్కిల్‌ను మహబూబాబాద్‌కు బదిలీ చేయించేలా కృషి చేస్తా: రాజ్యసభ ఎంపీ వేం నరేందర్‌రెడ్డి
కేసముద్రం: మహబూబాబాద్ ట్రాన్స్‌కో సబ్ డివిజన్‌ను వరంగల్ సర్కిల్లోనే కొనసాగించాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కార్మిక సంఘాల నాయకులు రాజ్యసభ ఎంపీ వేం నరేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలోని వేం నరేందర్‌రెడ్డి స్వగృహంలో ఎంపీని కలిసి తమ సమస్యను వివరించారు.
మహబూబాబాద్ జిల్లాను ట్రాన్స్‌కో పరంగా జనగామ సర్కిల్లో కలపడం వల్ల ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొనే ఇబ్బందులను నాయకులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. మహబూబాబాద్ సబ్ డివిజన్‌ను వరంగల్ ట్రాన్స్‌కో సర్కిల్లోనే కొనసాగించాలని కోరారు.
దీనిపై స్పందించిన ఎంపీ వేం నరేందర్‌రెడ్డి ట్రాన్స్‌కో సీఎండీతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిపారు. మహబూబాబాద్ సబ్ డివిజన్‌ను వరంగల్ సర్కిల్లోనే కొనసాగించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే జనగామ ట్రాన్స్‌కో సర్కిల్‌ను మహబూబాబాద్ జిల్లాకు బదిలీ చేసేలా కూడా ప్రయత్నిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ అధ్యక్షుడు బంధు శ్రీకాంత్, నాయకులు ఇస్మాయిల్, విద్యాసాగర్, కాసిం, సంధ్య, రుమానా తదితరులతో పాటు మహబూబాబాద్ జిల్లా కార్మిక సోదరులు పాల్గొన్నారు.

