స్వామివారి సన్నిధిలో వైభవంగా తిరుప్పావడ సేవ.. భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం
సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండాలని ఆకాంక్ష.. ఘనంగా తిరుప్పావడ సేవ
నర్సింహులపేట,ఆగస్టు 29 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వరస్వామి సమేత అలివేలు మంగమ్మ, పద్మావతి అమ్మవార్ల ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా తిరుప్పావడ సేవా అన్నకూటోత్సవాన్ని శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు 100 కిలోల వివిధ రకాల అన్నప్రసాదాలు, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, గుడాలు తదితర పిండివంటకాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ నైవేద్య సమర్పణ అనంతరం కర్పూర మంగళహారతులు నిర్వహించారు.సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ నిర్వహించే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ సేవగా పిలుస్తారని ఆలయ అర్చకులు పరశురామ శ్రీ నందనాచార్యులు, రాంబాబుచార్యులు భక్తులకు వివరించారు. ఈ సేవలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ఎస్సై వెంకన్న, సర్పంచ్ పెదమాముల యాకయ్య, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జినుకల రమేష్, మాజీ ఎంపీటీసీ అనురాధ దంపతులు, ఆలయ చైర్మన్ విజయ్ పాల్ రెడ్డి, ఆలయ మండలి సభ్యులు తదితరులు హాజరయ్యారు.తిరుప్పావడ సేవ నిర్వహణకు సహకరించిన దాతలు, భక్తులు, ఆలయ సిబ్బందికి అర్చకులు మరియు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భక్తులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.



