జర్నలిస్టుల క్షేమంతో పాటు,రోడ్డు భద్రతపై శ్రద్ధ.
మరిపెడ,ఆగస్టు 28 (నమస్తే న్యూస్):రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్‌లోని తన స్వగృహంలో జర్నలిస్టు సోదరులకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.నిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి,వార్తల సేకరణ కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమించే జర్నలిస్టుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి చిరుకానుకగా హెల్మెట్లను అందజేశారు.అనంతరం జర్నలిస్టు మిత్రులకు అల్పాహార విందు ఏర్పాటు చేసి,వారితో రాఖీ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..జర్నలిస్టులు ప్రజలకు,అధికారులకు,రాజకీయ నాయకులకు వారధిగా ఉంటూ నిత్యం వార్తల సేకరణ కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంటారని అన్నారు.వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని తన వంతు బాధ్యతగా కొందరు జర్నలిస్టు మిత్రులకు హెల్మెట్లు అందిస్తున్నట్లు తెలిపారు.మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ ఐపీఎస్ జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రోడ్డు ప్రమాదాల నివారణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణించాలని,ప్రమాద సమయంలో హెల్మెట్ తలకు రక్షణ కల్పించి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు.రోడ్డు ప్రమాదాల కారణంగా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు.ఇటీవల వెంకంపాడులో రోడ్డు ప్రమాదంలో మరణించిన సర్పంచ్ ఉప్పల సోమన్న ఘటనను ప్రస్తావిస్తూ..ఆయన హెల్మెట్ ధరించి ఉండి ఉంటే తలకు తీవ్ర గాయం కాకుండా ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు.తమ కుటుంబంలోనూ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుందని,తన భర్త కూడా రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారని సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి విషాద ఘటనలు మరెవరి కుటుంబాల్లోనూ జరగకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని,తమ ప్రాణాలను,కుటుంబాల భవిష్యత్తును కాపాడుకోవాలని ఆమె సూచించారు.“అందరికీ కాకపోయినా కొందరు జర్నలిస్టు మిత్రులకైనా నా వంతుగా ఈ చిన్న కానుక అందిస్తున్నాను.ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ వార్తలను సేకరిస్తూ,ప్రజలకు,అధికారులకు,రాజకీయ నాయకులకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టు సోదరులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.మీ క్షేమాన్ని కోరుకుంటూ ఈ హెల్మెట్‌ను చిరుకానుకగా అందిస్తున్నాను”అని సత్యవతి రాథోడ్ తెలిపారు.జర్నలిస్టుల భద్రతతో పాటు ప్రజల ప్రాణ రక్షణకు హెల్మెట్ వినియోగం ఎంతో కీలకమని,ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని ఆమె పిలుపునిచ్చారు.



