అరుదైన దృశ్యంతో బయ్యారంలో ఆసక్తి.. సోషల్ మీడియాలో వైరల్
రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్ | సెంటర్: బయ్యారం
బయ్యారం, ఆగస్టు 26 (నమస్తే న్యూస్):
మర్రి చెట్టు వేరు నుంచి కల్లు కారుతుండటంతో బయ్యారం మండల కేంద్రంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని చిన్నాలకుంట చెరువు వద్ద ఉన్న ఓ మర్రి చెట్టు వేరు నుంచి కల్లు జాలువారుతుండటాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. విషయం తెలుసుకున్న కల్లు ప్రియులు అక్కడికి చేరుకుని ఆసక్తిగా తిలకిస్తున్నారు.గీత కార్మికుడు ఆకుల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. చెట్టు వేరు నుంచి ద్రవం కారడాన్ని నాలుగైదు రోజులుగా గమనించారు. అనంతరం పరిశీలించగా మర్రి చెట్టు ప్రధాన వేరు నుంచి కల్లు మాదిరిగా ద్రవం జాలువారుతున్నట్లు గుర్తించారు. దీంతో వేరుకు గీత కత్తితో గీతలు పెట్టి లొట్టిని ఏర్పాటు చేశారు. అందులో ద్రవం పడుతుండటాన్ని గమనించి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు.ఈ విషయం స్థానికంగా ప్రచారం కావడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మర్రి చెట్టును చూసేందుకు పలువురు అక్కడికి వెళ్తున్నారు. కొందరు ఆసక్తితో చెట్టును పరిశీలిస్తుండగా, మరికొందరు మర్రి కల్లును రుచి చూసేందుకు అక్కడికి చేరుకుంటున్నారని స్థానికులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి ఆకుల శ్రీను మాట్లాడుతూ.. మర్రి చెట్టు పక్కనే ఉన్న గండు పెద్ద వెంకన్న వ్యవసాయ బావి పూడికతో నిండిపోవడంతో ఇటీవల ప్రొక్లెయిన్ సహాయంతో పూడికతీత పనులు చేపట్టారని చెప్పారు. ఆ పనులు చేస్తున్న సమయంలో చెట్టుకు చెందిన పెద్ద వేరు తెగిపోయిందని, ఆ తర్వాత మూడు నాలుగు రోజులుగా ఆ వేరు నుంచి ద్రవం జాలువారడాన్ని గమనించినట్లు వివరించారు.వేరు నుంచి వస్తున్న ద్రవాన్ని సేకరించి విక్రయిస్తున్నట్లు గీత కార్మికుడు తెలిపారు. అరుదైన ఘటనగా భావిస్తున్న స్థానికులు ఈ మర్రి చెట్టును చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

