మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 22(నమస్తే న్యూస్).
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని 4వ వార్డు పరిధిలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలను మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి శనివారం ఆకస్మికంగా సందర్శించారు.పాఠశాలకు చేరుకున్న ఆమె ముందుగా విద్యార్థుల వసతి గృహాలను,భోజనశాలను,స్టోర్ రూమును పరిశీలించారు. విద్యార్థులకు వండుతున్న భోజనాన్ని స్వయంగా తనిఖీ చేసి,వంటల నాణ్యత, పరిశుభ్రత, సరుకుల నిల్వ తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని,పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని పాఠశాల సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు,వసతులు, చదువు విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ప్లేట్లు,టవల్స్ ను చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి,4వ వార్డు కౌన్సిలర్ మెరుగు రాము,పాఠశాల హెచ్ఎం లాలు,వార్డెన్ రమేష్,ఉపాధ్యాయులు కృష్ణ,మోతిలాల్, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



