ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 15 (నమస్తే న్యూస్ డెస్క్):భూపాలపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై ప్రగతి నివేదికను వివరించారు.భూ సమస్యల పరిష్కారం కోసం భూ భారతి చట్టాన్ని అమలు చేస్తూ 223 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి 53,763 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 4,586 ఇళ్లు మంజూరు కాగా 797 ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు.
రైతు సంక్షేమంలో భాగంగా 29,683 మంది రైతులకు రూ.299.34 కోట్ల రుణమాఫీ, 1,27,151 మంది రైతులకు రూ.144.93 కోట్ల రైతు భరోసా అందించినట్లు తెలిపారు. 21,806 మంది రైతుల నుంచి 12.58 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి రూ.298.21 కోట్లకు పైగా చెల్లించినట్లు వెల్లడించారు.మహాలక్ష్మి పథకం ద్వారా 2.19 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయగా రూ.118.04 కోట్ల మేర ఆదా అయిందన్నారు. గృహజ్యోతి కింద 58,298 కుటుంబాలకు 15.41 లక్షల జీరో బిల్లులు జారీ చేసి రూ.50.86 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.
విద్యా రంగంలో ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలు, అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి, 13,745 మొక్కలు నాటినట్లు తెలిపారు. వైద్య రంగంలో 65 పల్లె దవాఖానాలతో పాటు జిల్లా ఆసుపత్రిలో ఎంఆర్ఐ, సీటీ స్కాన్, వెంటిలేటర్ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.
తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, భూపాలపల్లి వంటి మారుమూల జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, విద్యార్థులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. మహిళా సంఘాల సమాఖ్యకు రూ.91.56 కోట్ల చెక్కును అందించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.


