సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
విద్యావంతులే ఎక్కువగా మోసాల బారిన పడుతున్నారు:ఎస్పీ నరసింహ
‘సురక్షా కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ’ కార్యక్రమం ప్రారంభం
సూర్యాపేట రూరల్, ఆగస్టు 5 (నమస్తే న్యూస్):
సైబర్ నేరాల పట్ల ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, ఐపీఎస్ సూచించారు. విద్యావంతులే ఎక్కువగా సైబర్ మోసాల బారిన పడుతున్నారని, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా అధిక సంఖ్యలో మోసాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సురక్షా కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ’ కార్యక్రమాన్ని బుధవారం సూర్యాపేట రూరల్ పరిధిలోని చందన ఫార్మసీ కళాశాలలో ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు, తక్కువ వడ్డీకే రుణాలు, బహుమతులు వచ్చాయంటూ వచ్చే సందేశాలను నమ్మి మోసపోవద్దని సూచించారు. సోషల్ మీడియా, ఈమెయిల్ లేదా ఫోన్ ద్వారా అపరిచితులు పంపే లింకులను క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం, ఫొటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని సూచించారు.ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంచేందుకు ప్రతి బుధవారం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ‘సైబర్ జాగృతి దివస్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత, విద్యార్థులు సైబర్ భద్రతపై పూర్తి అవగాహన పెంపొందించుకుని డిజిటల్ ప్రపంచంలో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం పోలీసు కళాబృందం పాటల రూపంలో సైబర్ మోసాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించింది.ఈ కార్యక్రమంలో జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, రూరల్ ఎస్ఐ అనిల్, షీ టీమ్ ఎస్ఐ నీలిమ, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు, సైబర్ సెక్యూరిటీ సెల్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.





