బయ్యారం సొసైటీ చైర్మన్ ఎన్నిక నిలిపివేతపై వివాదం
రిపోర్టర్: పిల్లల నరసింహారావు
బయ్యారం, ఆగస్టు 3 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) చైర్మన్ ఎన్నిక నిలిపివేత వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బయ్యారం సొసైటీ చైర్మన్‌గా బండారి మల్లయ్య ఎన్నికైనట్లు ప్రకటించిన అనంతరం, ఎన్నికను నిలిపివేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా కసనబోయిన శీను మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించిన ఎన్నికను గంట వ్యవధిలోనే నిలిపివేయాలని స్థానిక ఎమ్మెల్యే సూచించడం వెనుక అసలు కారణాలు ఏమిటో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ప్రక్రియలో రాజకీయ జోక్యం తగదని, రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన సహకార సంఘాలను రాజకీయాలకు వేదికగా మార్చరాదని అన్నారు. ఎన్నికను నిలిపివేయడం సహకార సంఘాల స్వయం ప్రతిపత్తికి విఘాతం కలిగించే చర్యగా అభివర్ణించారు.
ఎన్నికను నిలిపివేయాలని ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారో ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు. ఎన్నిక నిలిపివేతకు గల పూర్తి కారణాలను పారదర్శకంగా వెల్లడించి, ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.కాగా ఈ ఎన్నిక నిలిపివేతపై అధికారుల అధికారిక వివరణ అందాల్సి ఉంది.


