కేజీబీవీ పాఠశాలలో డీసీఓ విజయకుమారి ఆకస్మిక తనిఖీలు
నర్సింహులపేట, జూలై 25 (నమస్తే న్యూస్)మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను జిల్లా కన్వీనర్ అధికారి (డీసీఓ) విజయకుమారి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న విద్యా బోధన, హాస్టల్ నిర్వహణ, పరిశుభ్రత, భోజన నాణ్యత, హాజరు నమోదుతో పాటు పలు రికార్డులను ఆమె పరిశీలించారు. విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, విద్యా ప్రమాణాలపై ఆరా తీశారు. అనంతరం డీసీఓ విజయకుమారి మాట్లాడుతూ, కస్తూరిబా పాఠశాలల్లో విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి సిబ్బంది బాధ్యత అని అన్నారు. విద్యార్థినుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు వారికి సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హాస్టల్ నిర్వహణ, ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని ప్రిన్సిపల్ స్వప్నకి, సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు, సిబ్బంది సీఈఓ వెంకన్న, పాల్గొన్నారు.


