మహబూబాబాద్ మార్కెట్‌లో ఉద్రిక్తత.
బకాయిల కోసం రైతుల ఆందోళన.. పెట్రోల్ పోసుకుని రైతు ఆత్మహత్యాయత్నం?
మహబూబాబాద్, ప్రతినిధి: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో రైతుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మిర్చి, మొక్కజొన్న పంటలను విక్రయించిన రైతులకు ఐదు నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో ఆగ్రహించిన రైతులు మార్కెట్ ప్రధాన గేటుకు తాళం వేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, పోలీసులు, స్థానికులు అప్రమత్తమై అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.
రైతుల కథనం ప్రకారం, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో ఎన్.ఎస్. ట్రేడర్స్ సంస్థకు మిర్చి, మొక్కజొన్న విక్రయించిన సుమారు 20 మంది రైతులకు రూ.30 లక్షలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. పలుమార్లు కోరినా చెల్లింపులు జరగకపోవడంతో రైతులు మార్కెట్ గేటు వద్ద ఆందోళనకు దిగుతూ "మా డబ్బులు మాకు ఇప్పించాలి" అంటూ నినాదాలు చేశారు.
ఆందోళన సందర్భంగా రైతులు, మార్కెట్ చైర్మన్ సుధాకర్ నాయక్, వైస్ చైర్మన్ మదన్ కుమార్ లోయ, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బాధిత రైతు మాడు హోలీ తీవ్ర మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు వెంటనే అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
బాధిత రైతు మాడు హోలీ మాట్లాడుతూ, ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించినప్పటికీ ఐదు నెలలుగా డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే అధికారులు జోక్యం చేసుకుని రైతులకు రావాల్సిన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
మరోవైపు బాధిత రైతులు మాట్లాడుతూ, మార్కెట్‌లోనే కాకుండా మార్కెట్ వెలుపల కొనుగోలు చేసిన మిర్చి, మొక్కజొన్న పంటలకు సంబంధించిన చెల్లింపులు కూడా ఇప్పటివరకు అందలేదని తెలిపారు. కొత్త వ్యవసాయ సీజన్ ప్రారంభమైన వేళ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని బకాయిల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

