గోశాలను తలపిస్తున్న బచ్చోడు తండా గ్రామపంచాయతీ కార్యాలయం..!
రిపోర్టర్: దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,జూలై 31 (నమస్తే న్యూస్ )
తిరుమలయపాలెం మండలం లోని బచ్చోడు తండా గ్రామపంచాయతీ వీధులన్నీ బురదమయం, అభివృద్ధికి ఆమడ దూరంలో గ్రామపంచాయతీ!"గ్రామపంచాయతీ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, కానీ ఇక్కడ కార్యాలయమే దుస్థితికి నిదర్శనంగా మారింది."అధికారుల నిర్లక్ష్యం ప్రజల కష్టాలకు కారణమైతే, అభివృద్ధి కాగితాలకే పరిమితమవుతుంది."బచ్చోడు తండా గ్రామపంచాయతీ కార్యాలయం ప్రస్తుతం గోశాలను తలపించేలా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయం పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, ఎక్కడ చూసినా బురద పేరుకుపోవడంతో ప్రజలు కార్యాలయానికి వెళ్లాలంటేనే ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు.గ్రామంలోని పలు వీధులు పూర్తిగా బురదమయంగా మారడంతో ప్రజలు నిత్యావసర రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు పడిన ప్రతిసారి పరిస్థితి మరింత దారుణంగా మారుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గత నాలుగు రోజులుగా గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రభలుతూ ఇప్పటికే డెంగ్యూ వ్యాధితో ఇద్దరు బాధపడుతున్నారని ప్రస్తుతం ఒకరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా ఈరోజు తీసిన శాంపిల్స్ లో మరొకరికి పాజిటివ్ అనుమానం ఉన్నట్లుగా డాక్టర్లు చెప్పడంతో గ్రామం అంతా భయంతో గురవుతున్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు.గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నప్పటికీ, వాటి ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయం పరిస్థితి చూస్తేనే గ్రామ అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ సమస్యలపై వివరణ కోసం గ్రామపంచాయతీ సర్పంచ్‌ను సంప్రదించగా స్పందించలేదని సమాచారం.గ్రామంలోని పారిశుద్ధ్యం, రహదారుల సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

