- నిషేధిత బీటీ-3 పత్తి నాటితే కఠిన చర్యలు:
- మండల వ్యవసాయ అధికారి నారెడ్డి సీతారామరెడ్డి హెచ్చరిక.
రిపోర్టర్:దామల్ల భాస్కర్
తిరుమలయపాలెం,జూలై 6 (నమస్తే న్యూస్)
ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత బీటీ-3 పత్తి విత్తనాలను సాగు చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తిరుమలాయపాలెం మండల వ్యవసాయ అధికారి నారెడ్డి సీతారామ రెడ్డి రైతులను హెచ్చరించారు. సోమవారం మండల పరిధిలోని టెట్టెలపాడు, దమ్మాయిగూడెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల సర్పంచుల సమక్షంలో పత్తి సాగు చేసిన రైతులను కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా బీటీ-3 పత్తి సాగు వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరించారు. దీనిపై స్పందించిన స్థానిక రైతులు.. తాము మొదట బీటీ-3 పత్తి వేయాలని భావించినప్పటికీ, వ్యవసాయ శాఖ ముందుగానే ఇచ్చిన సూచనలు, అవగాహన వల్ల ఆ ఆలోచనను విరమించుకున్నట్లు ఏఓకు తెలిపారు. అధికారుల మాటలు విని నిషేధిత విత్తనాలకు దూరంగా ఉన్నందుకు రైతులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటివరకు వివిధ కారణాల వల్ల పత్తి సాగు చేయలేకపోయిన రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని ఏఓ సూచించారు. అలాంటి వారు హెచ్‌డీపీఎస్ విధానంలో పత్తి సాగు చేసుకునేందుకు వ్యవసాయ శాఖ ద్వారా 100 శాతం సబ్సిడీతో విత్తనాలను అందిస్తున్నట్లు ప్రకటించారు. అర్హులైన రైతులు రేపటి (మంగళవారం) లోపల ఈ సబ్సిడీ విత్తనాలను పొంది, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిర్ర నర్సమ్మ ఏఈఓ రైతులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో తిరుగుతూ ఎవరైనా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందులు లేదా నకిలీ ఎరువులు విక్రయిస్తూ గుర్తిస్తే వెంటనే వ్యవసాయ అధికారులకు లేదా పోలీస్ శాఖకు సమాచారం అందించాలని రైతులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వంచే నిషేధించబడిన ఏ రకమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు వాడినా ఉపేక్షించేది లేదని, విక్రయదారులతో పాటు వాడే వారిపై కూడా చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఆసియా, ప్రదీప్‌లతో పాటు స్థానిక సర్పంచులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

