ఇచ్చిన మాట ప్రకారం రెండు నెలల్లో ఆసుపత్రి భవనం పూర్తి చేయాలి
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపరచాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్
రామన్నపేట, ఆగస్టు 4 (నమస్తే న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ఆసుపత్రిని మంగళవారం సందర్శించి రోగులతో మాట్లాడిన ఆయన, వైద్య సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆసుపత్రిలో అవసరమైన సంఖ్యలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విధుల్లో ఉండాల్సిన వైద్యులు పూర్తి సమయం ఆసుపత్రిలో సేవలందించడం లేదని, దీంతో పాము, కుక్క కాటు బాధితులు, గర్భిణీలు తదితరులను నల్గొండ, హైదరాబాద్ ఆసుపత్రులకు తరలిస్తున్నారని ఆరోపించారు.
గత ప్రభుత్వ హయాంలో ఆసుపత్రిలో మెరుగైన వసతులు, ప్రసూతి సేవలు, కేసీఆర్ కిట్, పోషకాహార కిట్, ఆర్థిక సహాయం వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేవని ఆయన పేర్కొన్నారు. రూ.11 కోట్లతో నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ, ప్రభుత్వం మారి 33 నెలలు గడిచినా పనులు పూర్తికాలేదని విమర్శించారు.
ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసుపత్రి భవన నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేసిన చిరుమర్తి లింగయ్య, ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన రెండు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, సర్పంచులు కునూరు సాయికుమార్ గౌడ్, గర్ధాస్ విక్రమ్, కంభంపాటి శ్రీనివాస్ గౌడ్, పులిపలుపుల వీరస్వామి గౌడ్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండి అమీర్, పార్టీ నాయకులు ఎస్కే చాంద్, జాడ సంతోష్ కుమార్, బత్తుల వెంకటేశం, బొడ్డు ఆల్లయ్య, గుండాల రాంబాబు, ఆవుల శ్రీధర్, జాల అమరేందర్ రెడ్డి, కర్రె శ్రీను, ఎండి ఆరిఫ్, పోషబోయిన భద్రయ్య, యాదగిరి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
.


