- పచ్చదనానికి.. పరిశుభ్రతకు పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందడుగు
- ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా మెగా క్లీన్ అండ్ గ్రీన్ క్యాంప్.
రిపోర్టర్: దామల భాస్కర్
తిరుమలాయపాలెం,జూలై 23( నమస్తే న్యూస్ )
పరిశుభ్రమైన వాతావరణం, పచ్చదనం ప్రాధాన్యతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో మెగా క్లీన్ అండ్ గ్రీన్ క్యాంప్ ఘనంగా నిర్వహించారు.
కళాశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, పరిసరాలను శుభ్రం చేశారు. పచ్చదనం పెంపొందించేందుకు అవసరమైన చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ‘పరిశుభ్రత మన బాధ్యత.. పచ్చదనం మన భవిష్యత్’ అనే సందేశాన్ని చాటిచెప్పారు.
ఈ కార్యక్రమానికి గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీమతి మాధవితో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది హాజరై తమ సహకారాన్ని అందించారు. కళాశాల ఆవరణ పరిశుభ్రతలో విద్యార్థులతో కలిసి వారు కూడా భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రామకృష్ణ మాట్లాడుతూ.. పరిశుభ్రమైన విద్యాసంస్థ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తొలి అడుగు అని అన్నారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై బాధ్యతాయుతమైన ఆలోచనలను పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పి. నారాయణరావు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సేవాభావాన్ని, సామాజిక బాధ్యతను పెంపొందించడమే ఎన్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సమాజహితం కోసం విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు.కార్యక్రమంలో ఏజీఎంసీ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు చంద్రమౌళి, నరసింహారావు, మురళీకృష్ణ, చైతన్య, సతీష్, ప్రవీణ్, లలిత, విజయలక్ష్మి, శ్రీలత, ఉపేందర్, వీరభద్రం, మల్సూర్ తదితరులతో పాటు కళాశాల అధ్యాపకేతర సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం అల్పాహారం అందించారు. విద్యార్థుల సేవా స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ వారికి అల్పాహారం అందించడం పట్ల వాలంటీర్లు హర్షం వ్యక్తం చేశారు. సమిష్టి భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ మెగా క్లీన్ అండ్ గ్రీన్ క్యాంప్ కళాశాల ప్రాంగణంలో పరిశుభ్రత, పచ్చదనంపై మరింత చైతన్యాన్ని నింపింది.

