- గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్న కాంగ్రెస్
- సీతక్కపై మాజీ ఎంపీ సీతారాం నాయక్ విమర్శలు.
డోర్నకల్/మరిపెడ, జులై 8 (నమస్తే న్యూస్):
మంత్రి సీతక్క వైఖరి గిరిజన సమాజాన్ని అయోమయంలోకి నెడుతోందని, ఒకవైపు తెలంగాణలో లంబాడీలకు అండగా ఉన్నట్లు చెబుతూ.. మరోవైపు ఢిల్లీలో ఆదివాసీల ఆందోళనకు మద్దతు తెలపడం ద్వారా గిరిజన తెగల మధ్య విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఆరోపించారు. బుధవారం మరిపెడ ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.గిరిజనుల త్యాగాలు, ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే నేటి పాలకులు అధికారంలోకి వచ్చారని పేర్కొన్న ఆయన, అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. దశాబ్దాలుగా లంబాడీల సమస్యలను నిర్లక్ష్యం చేసిన నాయకులు ఇప్పటికీ మౌనం వీడడం లేదని మండిపడ్డారు.మంత్రి సీతక్క వ్యవహారం “ఏ రోటికాడి పాట ఆ రోటికాడే” అన్న చందంగా ఉందని సీతారాం నాయక్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఒక విధంగా, ఢిల్లీలో మరో విధంగా మాట్లాడటం ద్వారా గిరిజన సమాజానికి తప్పుదారి చూపుతున్నారని ఆరోపించారు. గిరిజనులకు న్యాయం చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం, తెగల మధ్య విభేదాలను పెంచే రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.రాష్ట్రంలో గిరిజన విద్యాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం విశేష కృషి చేసిందని ఆయన తెలిపారు. ఏకలవ్య గురుకుల పాఠశాలలు, గిరిజన యూనివర్సిటీ, కేంద్రీయ విద్యాలయాలు, ఐఐటీ వంటి విద్యాసంస్థల ఏర్పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. అలాగే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు, జాతీయ రహదారులు, రైల్వే విస్తరణ, భద్రాద్రి–యాదాద్రి అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించడం బీజేపీ పాలనలో జరిగిన కీలక కార్యక్రమాలని వివరించారు.కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నట్లు కనిపించినా, అవినీతి అంశాల్లో మాత్రం ఒకరికి ఒకరు సహకరిస్తున్నారని సీతారాం నాయక్ ఆరోపించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే రెండు పార్టీలు రాజకీయ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు.రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఆయన, గిరిజనులు, రైతులు, పేదల సంక్షేమానికి బీజేపీ మాత్రమే కట్టుబడి ఉందన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన న్యాయం, సమగ్ర అభివృద్ధి అందించగల సామర్థ్యం బీజేపీకే ఉందని పేర్కొన్నారు.ఈ సమావేశంలో బీజేపీ నాయకులు గుగులోత్ దేవిక శంకర్ నాయక్, మండల అధ్యక్షుడు గంగాధర్, పట్టణ అధ్యక్షుడు భూక్యా మంగమ్మ లింగం నాయక్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు భూక్యా సుధాకర్ నాయక్, ఓబీసీ మోర్చా జిల్లా బాధ్యుడు పులి శ్రీనివాస్, నాయకులు నాగరాజు, కాంతమ్మ, బీజేవైఎం నాయకుడు రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


