బోరింగ్ తీసివేశారు.. మోటార్ బిగించారు..నీళ్లు మాత్రం కరువు!
11వ వార్డులో నెలకొన్న తాగునీటి సమస్య.
మున్సిపల్ కౌన్సిలర్,అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం.
తొర్రూరు,జూలై05(నమస్తే న్యూస్)
తొర్రూర్ పట్టణంలోని 11వ వార్డు చెరువు కట్ట సమీపంలో నెలరోజులుగా తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన మున్సిపల్ కౌన్సిలర్,అధికారులు తీసుకున్న చర్యలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చకపోవడంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఈ ప్రాంతంలో మోటార్ ద్వారా తాగునీటి సరఫరా జరిగేది. అయితే నీరు వృథా అవుతోందనే కారణంతో మోటార్‌ను తొలగించి, అధికారులు కొత్త బోరింగ్ ఏర్పాటు చేశారు. కొంతకాలం పాటు ఆ బోరింగ్ ద్వారా నీటి సరఫరా సజావుగా సాగింది.ఇటీవల బోరింగ్ దెబ్బతినడంతో దానిని మరమ్మతు చేయించకుండా తొలగించి,మళ్లీ మోటార్‌ను బిగించారు. “మోటార్ రిపేరింగ్‌లో ఉంది” అనే కారణంతో నీటి సరఫరా ప్రారంభించకుండానే పనులను నిలిపివేశారు. దీంతో స్థానికులు నెల రోజులుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పిన మున్సిపల్ కౌన్సిలర్, అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. “రిపేరింగ్‌లో ఉన్న మోటార్‌ను ఎందుకు బిగించారు..? మరమ్మతులు పూర్తయిన తర్వాతే ఏర్పాటు చేసి నీటి సరఫరా ప్రారంభించాల్సింది కాదా?” అంటూ ప్రశ్నిస్తున్నారు.తాగునీరు వంటి మౌలిక అవసరాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదని, 11వ వార్డు కౌన్సిలర్‌తో పాటు సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి మోటార్‌కు మరమ్మతులు పూర్తి చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

