- విద్యార్థి సంఘాల బంద్ కు కెవిపిఎస్ సంపూర్ణ మద్దతు.
- విద్య-వైద్య రంగాల పరిరక్షణకు రాజీలేని పోరాటాలు.
- కే వి పి ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్న లచ్చయ్య.
డోర్నకల్/మరిపెడ(జులై 10)నమస్తే న్యూస్.
విద్య,వైద్య రంగాలు ప్రజల ప్రాథమిక హక్కులని,వాటి పరిరక్షణ కోసం విద్యార్థి సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్)జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య అన్నారు.శుక్రవారం వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు జరిగిన నిరసన కార్యక్రమంలో కెవిపిఎస్ సామాజిక ఉద్యమం తరపున ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.విద్య అనేది సామాజిక అభివృద్ధికి మూలస్తంభం.గ్రామీణ పేదలు,దళితులు,బడుగు బలహీన వర్గాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలే ఆశాకిరణాలు.రాష్ట్రంలో వేలాది పాఠశాలలను మూసివేసి,పరిమిత సంఖ్యలో కొత్త పాఠశాలలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది.పల్లెల్లో విద్యా సదుపాయాలు తగ్గితే విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు.ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు,ఉపాధ్యాయుల కొరత,మౌలిక వసతుల లేమి ఉన్నాయి.ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి.పేద కుటుంబాలకు నాణ్యమైన విద్య అందకపోతే సామాజిక అసమానతలు మరింత పెరుగుతాయి.గురుకులాల విస్తరణ పేరుతో సంక్షేమ హాస్టళ్లను బలహీనపరిచే చర్యలు సరికాదు.పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న ప్రతి విద్యా అవకాశాన్ని కాపాడాలని కోరారు.జూన్ 15న పాఠశాలలు ప్రారంభమైనా ఇంకా కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు,యూనిఫారాలు అందలేదు.ప్రతి పాఠశాలలో తాగునీరు,మరుగుదొడ్లు,ఉపాధ్యాయుల నియామకం ప్రాధాన్యతగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది,మందులు,పరీక్షా పరికరాల కొరత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.పేదలకు ఉచిత,నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి.ఆగస్టు,సెప్టెంబర్ నెలల్లో డెంగ్యూ,వైరల్ జ్వరాలతో వచ్చే రోగులకు సరిపడా బెడ్లు లేక జిల్లా ఆస్పత్రిలో నేలపై చికిత్స చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి.వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా,ఆచరణలో పేదలకు మెరుగైన వైద్యం అందడం లేదని గుర్తు చేశారు.అలాగే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే అంశాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా పరిశీలించాలని కోరారు.రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు,మండలాల్లో విద్య,వైద్య రంగాల పరిస్థితిపై సమగ్ర సర్వే నిర్వహించి ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గంధసిరి జ్యోతి బస్,మాజీ జిల్లా నాయకులు గుండ గాని మధుసూదన్,పిడిఎస్యు,ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

