చినుకు పడితే చిత్తడవుతున్న కాలనీ రోడ్లు…
తీవ్ర ఇబ్బందుల్లో 4వార్డ్ కాలనీ వాసులు.
తిరుమలాయపాలెం,జూలై 6(నమస్తే న్యూస్)
బీరోలు గ్రామపంచాయతీ పరిధిలోని పలు కాలనీల్లో కనీస మౌలిక వసతుల లేమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు,డ్రైనేజీ వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో కార్యదర్శి గ్రామ సర్పంచి నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీ 4వ వార్డులోని గల్లీలో స్వల్పంగా చినుకు పడినా రోడ్లు పూర్తిగా బురదమయంగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో కాలినడకన వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యను పలుమార్లు గ్రామపంచాయతీ అధికారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపించారు. వెంటనే ఆ ప్రాంతంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున గ్రామపంచాయతీ అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

