ఏకగ్రీవ ఎన్నికపై అసమ్మతి వర్గం ఆగ్రహం.. మండల కమిటీని నిలదీసిన నాయకులు
పార్టీ కోసం కష్టపడిన వారికే అన్యాయం జరిగిందంటూ ఆవేదన
నర్సింహులపేట,అక్టోబర్02 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడపల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడి ఎన్నిక తీవ్ర అసంతృప్తికి దారితీసింది. గురువారం మండల పార్టీ అధ్యక్షుడు బొబ్బ సోమిరెడ్డి ఆధ్వర్యంలో దాసరి నాగేశ్వర్రావును గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ఈ ఎన్నికపై మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు కమటం వెంకన్న వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను సంప్రదించకుండా, తమకు అన్యాయం చేస్తూ గ్రామ కమిటీని ఎలా నియమిస్తారని మండల కమిటీ, సమన్వయ కమిటీ సభ్యులను నిలదీశారు.పార్టీ జెండాలను మోస్తూ, కష్టనష్టాలకు ఓర్చి ఎమ్మెల్యే విజయానికి కృషి చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో భాగస్వాములైన తమను ఇప్పుడు పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వకుండా, కొంతమందికి మాత్రమే ప్రాధాన్యత కల్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.ప్రస్తుత గ్రామ కమిటీలో నియమితులైన వారు పార్టీ కోసం ఎంతకాలం పనిచేశారు? వారి సేవలు ఏమిటి? గ్రామ శాఖ అధ్యక్షుడి నియామకం ఎవరి ఆమోదంతో జరిగింది? పార్టీ నియమ నిబంధనల ప్రకారం ఎన్నిక నిర్వహించారా? అనే ప్రశ్నలను లేవనెత్తారు. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొందని విమర్శించారు.గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలోనే నాయకుల మధ్య విభేదాలు బహిర్గతం కావడం చర్చనీయాంశంగా మారింది. కార్యకర్తల శ్రమకు తగిన గుర్తింపు, కమిటీ నియామకాల్లో పారదర్శకత కల్పించాలని అసమ్మతి నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కమటం వెంకన్న, జటంగి లింగన్న, చింతపల్లి ఉపేందర్, కొండ వీలేందర్, బొల్లోజు రామాచారి, కొమ్మినేని జగతి, కొమిరే వెంకన్న, ఇస్లావత్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

