గుండేపూడిలో ఘనంగా 119వ జయంతి వేడుకలు.
నమస్తే న్యూస్/డోర్నకల్ నియోజకవర్గం ప్రతినిధి:
భగత్‌సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి.
గుండేపూడిలో ఘనంగా 119వ జయంతి వేడుకలు.
నమస్తే న్యూస్/డోర్నకల్ నియోజకవర్గం ప్రతినిధి:
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండేపూడి గ్రామంలో షాహిద్ భగత్‌సింగ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.సీపీఐ(ఎం)శాఖ కార్యదర్శి ఎస్కే షరీఫ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ(ఎం)మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ ముఖ్య అతిథిగా పాల్గొని భగత్‌సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా గుండగాని మధుసూదన్ మాట్లాడుతూ..మనుషులను చంపగలరేమో కానీ వారి ఆశయాలను చంపలేరని చాటిచెప్పిన విప్లవ వీరుడు భగత్‌సింగ్ అని అన్నారు.‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదంతో స్వేచ్ఛా కాంక్షను రగిలించి,స్వరాజ్య సాధన కోసం చిరుప్రాయంలోనే ప్రాణత్యాగం చేసిన యోధుడని పేర్కొన్నారు.
భగత్‌సింగ్ ధైర్యం,ఆత్మవిశ్వాసం,ఆలోచనలు నేటి తరాలకు స్ఫూర్తిగా నిలిచాయని అన్నారు.మత సామరస్యం,శాంతియుత సహజీవనం,సమానత్వం,సామాజిక న్యాయానికి భగత్‌సింగ్ ప్రతీకగా నిలిచారని మధుసూదన్ తెలిపారు.1907 సెప్టెంబర్ 28న జన్మించిన భగత్‌సింగ్‌పై జలియన్‌వాలాబాగ్ ఘటనతో పాటు ప్రపంచంలోని విప్లవాత్మక పరిణామాలు ప్రభావం చూపాయని,భారతదేశంలో సమసమాజం,సామాజిక సమానత్వం నెలకొనాలని ఆయన ఆకాంక్షించారని పేర్కొన్నారు.జైలు జీవితంలోనూ భగత్‌సింగ్ విస్తృతంగా అధ్యయనం చేశారని,మార్క్స్,ఎంగెల్స్,లెనిన్,ట్రాట్స్కీ తదితరుల రచనలను చదివారని తెలిపారు.మూఢనమ్మకాలు,అంటరానితనం,మతతత్వం,సామాజిక అసమానతలను ఆయన తీవ్రంగా ప్రశ్నించారని అన్నారు.మతం వ్యక్తిగత విషయమని,వివిధ మతాల ప్రజలు రాజకీయంగా కలిసి పనిచేయాలంటే లౌకిక దృక్పథం అవసరమని భగత్‌సింగ్ తన రచనల్లో చర్చించారని తెలిపారు.భగత్‌సింగ్ రచనల్లో హేతుబద్ధ ఆలోచన,స్వేచ్ఛాయుత ఆలోచన,సామాజిక సమానత్వం వంటి అంశాలకు ప్రాధాన్యం కనిపిస్తుందని పేర్కొన్నారు.కుల వివక్ష,అంటరానితనం,సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా భగత్‌సింగ్ చేసిన ఆలోచనా పోరాటం నేటికీ ప్రాసంగికమని మధుసూదన్ అన్నారు.వివిధ రాజకీయ,సామాజిక వర్గాలు భగత్‌సింగ్ పేరును ప్రస్తావిస్తున్నప్పటికీ,ఆయన అసలు ఆశయాలను ఆయన రచనలు,ఆలోచనల ఆధారంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.భగత్‌సింగ్‌కు నిజమైన నివాళి చిత్రపటానికి పూలమాల వేయడం మాత్రమే కాదని,ఆయన ప్రశ్నించిన సామాజిక అసమానతలు,మూఢనమ్మకాలు,మతతత్వం,వివక్ష వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమేనని అన్నారు.భగత్‌సింగ్ స్ఫూర్తితో నేటి యువత తమ హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు బోడపట్ల రాజశేఖర్,కందాల రమేష్,శాఖ కార్యదర్శులు ఎస్కే షరీఫ్,బయ్య సురేష్,అల్లి శ్రీనివాసరెడ్డి,ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పెద్దపులి బాసు,వడ్లకొండ గంగరాజు,ఓరా వీరన్న తదితరులు పాల్గొన్నారు..
