రూ.13 లక్షలకు భూమి విక్రయం జరిగిందంటూ ప్రజావాణి( గ్రీవెన్స్)లో ఫిర్యాదు..
ప్రస్తుత సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పాత్రపై విచారణ జరపాలని డిమాండ్..
ఎంపీడీవో షేక్ సిలార్ సాహెబ్‌కు సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నేత కొత్తపల్లి శివప్రసాద్ ఫిర్యాదు..
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,సెప్టెంబర్ 28 (నమస్తే న్యూస్ )
మండలంలోని కాకరవాయి గ్రామంలో గ్రామకంఠం భూముల ఆక్రమణలు, విక్రయాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వానికి చెందిన గ్రామకంఠం భూములను అక్రమంగా ఆక్రమించి, ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ పార్టీకి చెందిన కొత్తపల్లి శివప్రసాద్ మండల ఎంపీడీవో షేక్ సిలార్ సాహెబ్‌కు సోమవారం నిర్వహించిన ప్రజావాణి ( గ్రీవెన్స్ )కార్యక్రమంలో ఫిర్యాదు పత్రం అందజేశారు.ఫిర్యాదులో శివప్రసాద్ చేసిన ఆరోపణల ప్రకారం.. కాకరవాయి గ్రామానికి చెందిన బత్తుల ఏడుకొండలు, బండారు భద్రయ్యలు గ్రామకంఠం భూమిని ఆక్రమించుకుని, అదే గ్రామానికి చెందిన షేక్ సమీర్ అనే వ్యక్తికి సుమారు రూ.13 లక్షలకు విక్రయించారని ఆరోపించారు. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన గ్రామకంఠం భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఎలా విక్రయించగలిగారనే అంశంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పాత్రపై ఆరోపణలు..
ఈ వ్యవహారంలో ప్రస్తుత సర్పంచ్,(సర్పంచ్ గా ఎన్నుకోకముందు.) ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి పాత్రపైనా అనుమానాలు ఉన్నాయని శివప్రసాద్ ఆరోపించారు. గ్రామకంఠం భూముల పరిరక్షణ బాధ్యత ఉన్నప్పటికీ ఆక్రమణలు, నిర్మాణాలు, విక్రయాలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.అయితే ప్రస్తుత సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిపై చేసిన ఈ ఆరోపణలు ఫిర్యాదుదారుడి వాదనలేనని, వాటిపై అధికారిక విచారణ ద్వారా వాస్తవాలు నిర్ధారించాల్సి ఉంది.
ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులదే.
గ్రామకంఠం భూములు పేదలు, ప్రజా అవసరాలకు ఉపయోగపడాల్సినవని, వాటిని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించేందుకు వీలు లేదని శివప్రసాద్ పేర్కొన్నారు. ఆక్రమణలకు పాల్పడినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గ్రామంలో ఉన్న గ్రామకంఠం భూములపై పూర్తిస్థాయి సర్వే నిర్వహించి, రికార్డులను పరిశీలించి, ఆక్రమణలు నిజమని తేలితే వాటిని తొలగించాలని కోరారు. అలాగే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పాత్రపై కూడా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ భూముల పరిరక్షణలో నిర్లక్ష్యం వహించినా, అక్రమ ఆక్రమణలకు సహకరించినా బాధ్యులెవరైనా చర్యలు తప్పవని స్పష్టం చేయాలని శివప్రసాద్ అధికారులను కోరారు.
