అర్హత లేని వారికి ధ్రువపత్రాలు జారీ చేసిన తహసీల్దార్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
ఎస్టీ కేటగిరీలో ఎంబీబీఎస్ సీట్లు పొందిన వారందరి ధ్రువపత్రాలను పునఃపరిశీలించాలి
లంబాడీ హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ భీమా నాయక్ డిమాండ్
నమస్తే న్యూస్/డోర్నకల్ నియోజకవర్గం ప్రతినిధి,సెప్టెంబర్ 27:
తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన అనర్హులను ఎస్టీలుగా గుర్తించి కుల ధ్రువపత్రాలు జారీ చేసిన తహసీల్దార్లపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని లంబాడీ హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ భీమా నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మహారాష్ట్ర,కర్ణాటక,రాజస్థాన్,ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చిన వారికి నిబంధనలకు విరుద్ధంగా ఎస్టీ కుల ధ్రువపత్రాలు జారీ చేసినట్లు ఆయన ఆరోపించారు.కుల ధ్రువపత్రాల జారీ ప్రక్రియలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై సమగ్ర విచారణ జరిపించాలని భీమా నాయక్ కోరారు.ఇప్పటికే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రవేశాల ప్రక్రియలో మొదటి విడతలో 12 మందిని,రెండో విడతలో 37 మందిని ఎస్టీ కుల ధ్రువపత్రాల విషయంలో అనర్హులుగా గుర్తించినట్లు ఆయన తెలిపారు.రెండో విడతలో అనర్హులుగా గుర్తించిన 37 మందిలో తొమ్మిది మందికి ఎంబీబీఎస్ సీట్లు లభించాయని,దీని వల్ల అర్హులైన తొమ్మిది మంది అభ్యర్థులకు సీట్లు దక్కకుండా అన్యాయం జరిగిందని భీమా నాయక్ ఆరోపించారు.
710 మంది ధ్రువపత్రాల పునఃపరిశీలన చేయాలి.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎస్టీ కేటగిరీలో ఎంబీబీఎస్ సీట్లు పొందిన మొత్తం 710 మంది విద్యార్థుల కుల ధ్రువపత్రాలను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి పునఃపరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు.నిబంధనల ప్రకారం తెలంగాణలో ఎస్టీ హోదాకు అర్హత కలిగిన వారిని మాత్రమే గుర్తించేలా సమగ్ర పరిశీలన చేపట్టాలని కోరారు.ఎస్టీ కేటగిరీకి సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యే వరకు ఎంబీబీఎస్ మూడో విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు.అనర్హులుగా నిర్ధారణ అయిన విద్యార్థుల కుల ధ్రువపత్రాలను రద్దు చేసి,వాటి ఆధారంగా పొందిన ప్రవేశాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
తప్పుడు సమాచారంతో ఎస్టీ కుల ధ్రువపత్రాలు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు,వాటిని జారీ చేసిన సంబంధిత అధికారులపై చట్టప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భీమా నాయక్ డిమాండ్ చేశారు.భవిష్యత్తులో జరిగే వైద్య విద్య ప్రవేశాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎస్టీ ధ్రువపత్రాలు ఉపయోగించకుండా కఠినమైన పరిశీలన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే వందలాది మంది తెలంగాణ లంబాడీలతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని భీమా నాయక్ హెచ్చరించారు..
