అభినవ అంబేద్కర్గా కీర్తి గడించిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ జగదీశ్ మృతి
రోడ్డు ప్రమాదంలో దుర్మరణం.. యావత్ ఖమ్మం జిల్లా దిగ్భ్రాంతి
వేలాది ప్రాణాలకు భరోసానిచ్చిన వైద్యుడి ఆకస్మిక మృతి.. కన్నీరుమున్నీరవుతున్న మాలజాతి
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 20 (నమస్తే న్యూస్ )
మాలజాతి ముద్దుబిడ్డ.. వైద్యరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ జగదీశ్ ఇక లేరు. రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందడంతో యావత్ ఖమ్మం జిల్లా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతివార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులతో పాటు మాలజాతి కన్నీరుమున్నీరవుతోంది.
మమతా హాస్పిటల్లో న్యూరో సర్జన్ హెచ్ఓడీగా సేవలందించిన డాక్టర్ జగదీశ్.. ఎన్నో క్లిష్టమైన న్యూరో శస్త్రచికిత్సలు నిర్వహించి అనేక మంది ప్రాణాలను కాపాడిన వైద్యుడిగా పేరు సంపాదించుకున్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్యం అందిస్తూ వారి కుటుంబాల్లో ఆశలు నింపిన వైద్యుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వైద్య వృత్తిని కేవలం ఉపాధిగా కాకుండా సేవగా భావించిన డాక్టర్ జగదీశ్.. సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు అండగా నిలిచారని ఆయనను పరిచయం ఉన్నవారు గుర్తుచేసుకుంటున్నారు. తన ప్రతిభతో వైద్యరంగంలో ఎదగడంతో పాటు సామాజికంగా కూడా ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆయనను పలువురు అభినవ అంబేద్కర్’ గా కీర్తించేవారు.
ఒక్క ప్రమాదం.. ఎన్నో గుండెల్లో విషాదం
ఎందరో ప్రాణాలను కాపాడిన వైద్యుడి ప్రాణమే రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలకు వెళ్లడం విషాదాన్ని మరింత పెంచింది. ఆయన ఆకస్మిక మృతితో ఖమ్మం జిల్లా వైద్యరంగంతో పాటు సామాజిక వర్గాల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.
మాలజాతి కన్నీటి నివాళి
డాక్టర్ జగదీశ్ మృతి మాలజాతికి తీరని లోటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ జాతి నుంచి ఎదిగి ప్రముఖ వైద్యుడిగా వేలాది కుటుంబాలకు సేవలందించిన వ్యక్తిని కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆయన మరణవార్తతో మాలజాతి శోకసంద్రంలో మునిగిపోయింది. మాలజాతి ముద్దుబిడ్డకు కన్నీటి వీడ్కోలు పలుకుతూ.. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తోంది.
డాక్టర్ జగదీశ్ ఆకస్మిక మృతి ఆయన కుటుంబానికే కాదు.. ఆయన వైద్యసేవలు పొందిన వేలాది కుటుంబాలకు, అభిమానులకు, ఖమ్మం జిల్లా ప్రజలకు తీరని విషాదాన్ని మిగిల్చింది.
